విద్యార్థులతో వైఎస్ షర్మిల భేటీ..

హైదరాబాద్ లోటస్ పాండ్ లో యూనివర్శిటీ విద్యార్థులు, నిరుద్యోగులతో వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. సుమారు 300 మంది విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశం అయ్యారు షర్మిల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది..? నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యిందా అనే అంశాలపై నేరుగా విద్యార్థులతో మాట్లాడారు షర్మిల. ఈ సందర్భంగా లోటస్‌పాండ్ వద్ద విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలన్నా, ఫీజు రియంబర్స్‌మెంట్ మళ్లీ పూర్తి స్థాయిలో అమలు కావాలన్నా రాజన్న రాజ్యం రావాలని షర్మిలక్క చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. గతంలో టీఆర్ఎస్ యువతను వాడుకుని, తామే తెలంగాణ తెచ్చామని కేసీఆర్.. మేమే ఇచ్చామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. అసలు తెలంగాణ ఉద్యమానికి పునాదే యువకులని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం యువకులను పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో రాజన్న రాజ్యంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు షర్మిల కూడా తమకు ప్రాధాన్యత ఇస్తారని నమ్మి వచ్చామన్నారు. ఈ విషయంలో ఆమె తమకు హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు.