పుదుచ్చేరి తదుపరి ఎల్జీగా మాజీ పోలీస్‌ కమిషనర్‌?

న్యూఢిల్లీ: పుదుచ్చేరి తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ భీమ్ సెయిన్ బస్సీని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సీ నియామకంపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా యోచిస్తున్నట్లు సమాచారం. మరో మూడు నెలల్లో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నందున వీలైనంత త్వరగా పూర్తిస్థాయి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నాది.

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి ఈ నెల 16 కిరణ్ బేడిని తొలగించారు. అనంతరం బలపరీక్షలో కాంగ్రెస్‌-డీఎంకే ప్రభుత్వం విఫలం కావడంతో ఇంచార్జి ఎల్జీ తమిళిసై సూచనల మేరకు కేంద్ర క్యాబినెట్‌ పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మే నెలలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పుదుచ్చేరి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ పదవికి ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా పనిచేసి ప్రభుత్వ మన్ననలు పొందిన బస్సీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ విషయంలో తొందరపాటు వద్దని కేంద్రంలోని పెద్దలు సూచిస్తున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) లో ఢిల్లీ మాజీ పోలీస్ చీఫ్ ఐదేండ్ల పదవీకాలం ఫిబ్రవరి 28 తో ముగుస్తుంది.