రాజకీయ వ్యవస్థను దిగజార్చిన ఘనత వైసీపీది

•కులాలు, ప్రాంతాల పేరిట విద్వేష పాలన సాగిస్తున్నారు
•అమరావతిని చంపేశారు
•ఉద్యోగులు నెల జీతం వస్తే సీఎంకు పాలాభిషేకాలు చేసే పరిస్థితి
•క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ జాడ లేదు
•మంత్రులు పారిశ్రామికవేత్తలతో ఫోటోలకు పరిమితం అవుతున్నారు
•పక్క రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం వెనకబడిపోతున్నాం
•రోజుకు రూ.205 కోట్ల అప్పు చేస్తున్నా అభివృద్ధి లేదు
•ప్రశ్నించే వారిని చూసి ప్రభుత్వం భయపడుతోంది
•సామాన్యుల రాజ్యాధికారం కోసం జనసేన కృషి
•పదవుల కోసం జనసేనలోకి రాలేదు
•శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయసాధనలో భాగస్వామిగానే వచ్చా
•త్వరలో విజయవాడ వేదికగా టిడ్కో లబ్దిదారుల తరఫున ఉద్యమం
•విజయవాడలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘రాజకీయ వ్యవస్థను దిగజార్చిన ఘనత వైసీపీకే దక్కుతుంది… ఎన్నికల్లో సీట్లు అమ్ముకున్నారు.. అధికారంలోకి వచ్చాక కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి విద్వేషపూరిత పరిపాలన రాష్ట్రంలో సాగిస్తున్నారు.. అమరావతిని చంపేశారు… ప్రశ్నించే వారిని చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. మన మంత్రులు పారిశ్రామికవేత్తలతో ఫోటోలకు పరిమితం అవుతుంటే.. పెట్టుబడులు పక్కనున్న తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వస్తే చాలు ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేసే పరిస్థితికి తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. క్యాలెండర్లు మారిపోతున్నా ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ కనబడడం లేదన్నారు. పెట్టుబడుల పేరిట యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు రాజ్యాధికారం కల్పించేలా జనసేన పార్టీ కృషి చేస్తోందన్నారు. కొత్త నాయకత్వాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. పదవుల కోసం తాను జనసేన పార్టీలో చేరలేదని చెప్పారు. కొత్త నాయకత్వాన్ని పెంపొందించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన ప్రయాణంలో తన వంతు కృషి చేసేందుకే వచ్చానని అన్నారు. సోమవారం విజయవాడలో మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మొదటి విడత నుంచి ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్తోంది. సభ్యత్వం అంటే ఓటరు లిస్టులో పేర్లు రాసుకునే సంప్రదాయానికి భిన్నంగా.. జనసేన పార్టీ పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పుడు సరికొత్త యాప్ ద్వారా మూడో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకురావడం జరిగింది. సాంకేతికతను ఉపయోగించుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా చూడాలి. క్రియాశీలక సభ్యులకు అస్త్ర యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మొదటి విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ఈ కార్యక్రమానికి వచ్చాను.
* భరోసా నింపగలిగాం
ఎలాంటి పదవులు ఆశించకుండా కొంత మంది వాలంటీర్లు గతంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవస్థలో మనం ఒక నమ్మకాన్ని కలిగించగలిగాం. ఆపదలో ఉన్న వారి కుటుంబాల్లో భరోసా నింపాం. కృష్ణా జిల్లా, చల్లపల్లికి చెందిన రోజు కూలి శ్రీ దొరబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు.. రోజు కూలీ అయిన అతను సభ్యత్వం తీసుకున్న విషయం కూడా ఇంట్లో వాళ్లకు తెలియదని చెబితే ఆశ్చర్యం కలిగింది. కష్టకాలంలో ఆ కుటుంబాన్ని ఆదుకోగలిగాం. గుంటూరుకు చెందిన శ్రీ భిక్షపతి కూడా రోజు కూలి. ఆయన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. పి. గన్నవరం, అమలాపురం లాంటి కొన్ని నియోజకవర్గాల్లో 9,900 సభ్యత్వాలు నమోదు అయ్యాయి. పులివెందులలోనూ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. 350 మందికి పైగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. రాష్ట్రంలో గ్రామ గ్రామాన జనసేన క్రియాశీలక సభ్యులు ఉన్నారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడుతోంది. అదే స్ఫూర్తిని మరోసారి ముందుకు తీసుకువెళ్లండి. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. విజయవాడలో వాలంటీర్లు ఇప్పటికే సభ్యత్వ నమోదులో ముందుకు దూసుకుపోతున్నారు. క్రియాశీలక సభ్యులకు అందించే కిట్ల పంపిణీలో మార్పులు తీసుకువస్తున్నాం. షణ్ముఖ వ్యూహంతో కూడిన ఒక బ్రోచర్, ప్రతి క్రియాశీలక సభ్యుడికి గాజు గ్లాసు గుర్తుతో కూడిన బటన్ అందిస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో ధరించేందుకు అవకాశం కల్పిస్తున్నాం. దేశంలో మరే రాజకీయ పార్టీ ఆలోచన కూడా చేయని కార్యక్రమం ఇది. ఆపద సమయంలో కార్యకర్తలకు రూ. 5 లక్షల బీమాతో పాటు రూ. 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆరు కోట్ల 70 లక్షల రూపాయిలు పంపిణీ చేశాం. క్రియాశీలక సభ్యత్వం నాయకత్వాన్ని పెంపొందించే కార్యక్రమం.
•వైసీపీ డిపాజిట్లు తీసుకుని సీట్లు ఇచ్చింది
పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేసేందుకు కృషి చేయాలి. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి. వ్యక్తిగత అజెండాలతో ముందుకు వెళ్తే కిందపడిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. నేను పదవుల కోసం జనసేన పార్టీలో చేరలేదు. చక్కటి నాయకత్వాన్ని తయారు చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రయాణంలో నావంతు కృషి చేయడానికే వచ్చాను. 2018లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వం రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు? రాజకీయ నేపథ్యం ఉన్నవారికే ఎందుకు అవకాశం ఇవ్వాలి అని ఆలోచించిన పార్టీ జనసేన. సామాన్యులకు రాజ్యాధికారం కోసం జనసేన పని చేస్తుంది. వైసీపీ అప్పట్లో ఒక్కో అభ్యర్ధి వద్ద రూ.20 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. అదేమంటే మీ బలం ఎంతో చూస్తామని చెప్పారు. అలాంటి వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకువచ్చినప్పుడు దోపిడి జరగకుండా ఎలా ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా.. మాట్లాడితే సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా కేసులు కట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ పాలన సాగిస్తున్నారు. ఇంతకు మించి సిగ్గుచేటు ఏముంది?
•రాష్ట్రంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 19 శాతం తగ్గాయి
హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి చూస్తే బాధ కలుగుతోంది. అమరావతిని కావాలనే చంపేశారు. పక్క రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం ఎందుకు వెనకబడిపోతున్నాం. పెట్టుబడుల గురించి అడిగితే మంత్రులు కోడి పెట్ట, గుడ్డు అంటూ కబుర్లు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలతో వీళ్లు ఫోటోలకు పరిమితం అవుతుంటే పెట్టుబడులు తెలంగాణకు పోతున్నాయి. మొన్న ఉదయం మన ఐటీ మంత్రి శ్రీ ఆనంద్ మహీంద్రాతో ఫోటో దిగి రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. మరుసటి రోజు శ్రీ మహీంద్ర తెలంగాణలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించారు. ప్రతి రోజు రూ.205 కోట్ల అప్పులు తెస్తున్నారు. రోజుకు ఆదాయం రూ. 414 కోట్లు వస్తోంది. నెలకి రూ. 12,800 కోట్ల ఆదాయం వస్తుంటే రూ. 6 వేల కోట్లు అప్పులు తెస్తున్నారు. ఆ డబ్బంతా ఏమైపోయినట్టు. ఎందుకు ఒక్క రోడ్డు కూడ వేయలేకపోతున్నారు. అధికార పార్టీ కార్పోరేటర్లు, వార్డు మెంబర్లు రాజీనామా చేస్తామంటూ బెదిరిస్తున్నారు. చెత్తకు పన్ను వేయడం ఎక్కడైనా ఉందా? విజయవాడకు చెందిన మాజీ మంత్రి గడప గడపకు వస్తాను అంటే రావద్దని ప్రజలు బ్యానర్లు కడుతున్నారు. గడప గడపకు కార్యక్రమానికి పోలీసుల్ని వెంటబెట్టుకుని వెళ్తున్నారు. పెద్దవాళ్ళు ఫించన్ అడిగినా.. యువకులు ఉద్యోగం గురించి అడిగినా కేసులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లిపోతున్నారు. టూ వీలర్స్ అమ్మకాలు అన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో 19 శాతం తగ్గాయి. పరిపాలన అంటే ఎన్నికలప్పుడు వచ్చి నాలుగు మాటలు చెప్పే కార్యక్రమం కాదు.
•ఆ కేటాయింపుల్లో దాపరికాలు ఎందుకు?
విశాఖలో ఇన్ఫోసిస్ వచ్చేస్తుందని ప్రకటనలు చేశారు. ఇన్ఫోసిస్ ఎక్కడ వచ్చిందా? కేబినెట్ భేటీ అనంతరం కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు. మొన్న జిందాల్ సంస్థను నాలుగో కృష్ణుడిగా తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు ఆ సంస్థకు తెరవెనుక రామాయపట్నం పోర్టులో రెండు కమర్షియల్ బెర్తులు, 600 ఎకరాల స్థలం ఇచ్చారు. ఈ దాపరికాలు ఎందుకు? మీ దగ్గర నిజాయితీ లేదు. పెట్టుబడులు ఎలా వస్తాయి. దావోస్ వెళ్లొస్తే సరిపొతుందా? రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చే వాతావరణం కల్పిస్తున్నారా? ఇప్పుడు పెట్టుబడుల సదస్సు అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చాయి. మీరు రాకముందు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తామన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇప్పుడు 20 మందితో తూతూ మంత్రంగా ఎందుకు నడుస్తోంది. ఈ ప్రభుత్వం యువతను మోసం చేస్తోంది. క్యాలెండర్లు మారిపోతున్నాయి గాని ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ కనబడడం లేదు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను హాస్యాస్పదం చేశారు. మంత్రులకు వారి శాఖల మీద అవగాహన ఉందా? రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తేనే పెట్టుబడులు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారు వారి స్వలాభం కోసం మినహా ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేసే వ్యక్తులు కాదు.
•వ్యూహాలు శ్రీ పవన్ కళ్యాణ్ కి వదిలేయండి
జనసేన పార్టీ వరకు రాజకీయ వ్యూహాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేయండి. సీట్ల మీద కర్చీపులు వేసుకుని కూర్చుంటే కుదరదు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించండి. పార్టీలోకి వచ్చే వారిని స్వాగతించండి. విజయవాడ పట్టణంలో జనసేన పార్టీ నంబర్ వన్ స్థాయికి ఎదగాలి. ఎవరి డివిజన్లో వారు బలంగా పని చేయండి. 15 వేల క్రియాశీలక సభ్యత్వం లక్ష్యంగా ముందుకు వెళ్లాలి. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ మేలు జరిగే విధంగా టిడ్కో గృహాల వ్యవహారంలో విజయవాడ వేదికగా నిరసన కార్యక్రమం చేద్దాం. దసరాకే గృహ ప్రవేశాలు అని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించారు. తర్వాత ముఖ్యమంత్రి పుట్టిన రోజు అన్నారు, క్రిస్మస్, సంక్రాంతి దాటించి ఇప్పుడు ఉగాది అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల మందికి ఇస్తామన్న ఇళ్లు ఏమయ్యాయో చెప్పాలి. పేదల ఇళ్ల పేరిట రాష్ట్రంలో 75 వేల కోట్లతో అతిపెద్ద స్కామ్ కు ఈ ప్రభుత్వం పాల్పడింది. టిడ్కో గృహాల దుస్థితిని జనసేన పార్టీ కళ్లుకు కట్టింది. ఖచ్చితంగా లబ్దిదారుల తరఫున నిరసన కార్యక్రమం చేపడదాం. క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు సీరియస్ గా ముందుకు తీసుకువెళ్లాలి” అన్నారు.
*రేపటి రోజున మేమూ కేసులు పెడతాం: శ్రీ పోతిన వెంకట మహేష్
విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలతో విజయవాడలో కొన్ని పార్టీల అడ్రస్ ఇప్పటికే గల్లంతయ్యింది. గత నాలుగేళ్లుగా జనసేన అధిష్టానం మద్దతుతో అధికార పార్టీ విధానాలపై అలుపెరుగని పోరాటం చేశాం. పోరాడిన ప్రతిసారి కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు కేసులు పెడితే జనసేన ప్రభుత్వంలో మేమూ కేసులుపెడతాం. అంతకంత బదులు తీర్చుకుంటాం. జనసేన క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలు తమ కుటుంబాలకు భద్రత ఏర్పాటు చేసుకున్నట్టే టిడ్కో లబ్దిదారుల పక్షాన జనసేన పార్టీ తరఫున శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేద్దాం. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. ప్రతి కార్యక్రమంలో పట్టణ నాయకత్వం మొత్తం సమన్వయంతో ముందుకు వెళ్దామ”ని అన్నారు.
*ఆయనే నిజమైన కార్యకర్త: శ్రీ అమ్మిశెట్టి వాసు
రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ “రాష్టం మొత్తం విజయవాడ పట్టణం వైపు చూసే స్థాయిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పార్టీలో క్రమశిక్షణకు మారుపేరు, నిజమైన కార్యకర్త అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారి స్ఫూర్తితో అంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలి. పార్టీని ఒక రథ సారధిగా ముందుకు తీసుకువెళ్తున్న శ్రీ మనోహర్ గారి మీద అనవసర విమర్శలను సహించేది లేద”న్నారు. కార్యక్రమంలో పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, ఉమ్మడి కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ పి.ఆర్.కె. కిరణ్, పార్టీ నాయకులు శ్రీ బొలిశెట్టి వంశీ, శ్రీ వెన్నా శివశంకర్, శ్రీ సోమనాధం తదితరులు పాల్గొన్నారు.