కాంగో: బంగారం గనులు కూలి 50 మంది మృతి

కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారం గనులు కూలిన ఘటనలో 50 మంది వరకు కార్మికులు మృతి చెంది ఉంటారని అక్కడి అధికారవర్గాలు చెప్పాయి. కాంగోలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన సమయంలో గనులలో 50 మంది వరకు ఉన్నారని.. వాళ్లంతా అక్కడి నుంచి తప్పించుకునే మార్గం కూడా లేకపోయిందని ఇనిషియేటివ్ ఆఫ్ సపోర్ట్ అండ్ సోషల్ సూపర్‌విజన్ ఆఫ్ ఉమెన్ అధ్యక్షులు ఎమిలియేన్ ఇటోంగ్వో తెలిపారు. కాంగోలో బంగారం తవ్వకాలు జరిపేందుకు కెనడా మైనింగ్‌ కంపెనీ బన్రో కార్పోరేషన్‌ అనుమతి ఉండాలని, అయితే ఈ గని దాని పరిధిలో లేదని అన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.