98.4 శాతం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వైసీపీ

  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి.

గుంటూరు, సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టడమే కాకుండా 98.4 శాతం హామీలను నెరవేర్చామంటూ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు వల్లెవేస్తున్న వైసీపీ నేతలు 98.4 శాతం ప్రజల్ని మోసం చేసారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ధ్వజమెత్తారు. గురువారం జగన్ రెడ్డి 100 మోసాలు పేరిట శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద కరపత్రాలను విడుదల చేసారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి వంద మోసాలు అప్పుడేం చెప్పావు – ఇప్పుడేం చేస్తున్నావు అంతా మోసం – వైసీపీ నైజం అంటూ నినాదాలు చేశారు. నాడు అధికారంలోకి రావటానికి అలవికాని హామీలివ్వటంతో పాటు అన్ని వర్గాల వారికి ఎన్నో ఆశలు కల్పించిన వై యస్ జగన్ అధికారంలోకి రాగానే తన వికృత రూపాన్ని బయటబెట్టారని దుయ్యబట్టారు. మాట్లాడితే 98.4 శాతం హామీలు నెరవేర్చామంటూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని, వైసీపీ మాయమాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని, మద్యనిషేధం, సీపీయస్ రద్దు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ వారికి ఉద్యోగ భద్రత, పోలవరం నిర్మాణం, రైతులకు విత్తన సబ్సిడీ, ధరల పెంపు, చెత్తపన్ను ఇలా ఎన్నో హామీలను తుంగలో తొక్కి అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు చెప్పటానికి వైసీపీ నేతలకు ఆత్మసాక్షి కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు. సకల రోగాలకు కరక్కాయే వైద్యం అన్నట్లుగా రాష్ట్రంలోని సమస్త సమస్యలకు నవరత్నాలే పరిష్కారం అన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రదానంగా ముస్లిం, మైనార్టీలకు, ఎస్సి, ఎస్టి, కాపులకు వైసీపీ చేసిన దగా గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుందని ఆవేదన చెందారు. ఇంకోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆడపిల్లల రక్షణ గాల్లో దీపంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి అనేమాటకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని, కనీసం దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా అధోగతి పాలుచేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అవినీతితో, కులమత పిచ్చితో కునారిల్లుతున్న నేటి రాజకీయ వ్యవస్థను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే ప్రక్షాళన చేయగలడు అన్న నమ్మకం ప్రజల్లో కలగటం శుభపరిణామమని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి శ్రీను, బండారు రవీంద్ర, షర్ఫుద్దీన్, గోపిశెట్టి రాజశేఖర్, భాషా, దాసరి రాము, దొంత నరేష్, ఇళ్ళ చిరంజీవి, కే.వెంకటేశ్వరరావు, గోపి, బాలాజీ, సుభాని తదితరులు పాల్గొన్నారు.