అమెరికాలో ట్రంప్‌ అరాచకం.. క్యాపిటల్ భవనంలో కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినప్పటి నుంచి దేశంలో పరిణామాలు రోజుకో మలుపుతీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ గెలుపును ధృవీకరించేందుకు తాజాగా యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైంది. ఈ సమయంలో అమెరికా క్యాపిటల్‌ భవనంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రంప్‌ మద్దతు దారులు క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకు రావడంతో బైడెన్‌ ధృవీకరణకు ఆటంకం ఏర్పడింది.

బైడెన్‌ ఎన్నికను ట్రంప్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సమయంలోనే కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలో ఆమె మెడపై తూటా గాయమైంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. చివరకు ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సివచ్చింది. ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్‌ గెలుపు ధ్రువీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఆందోళనకారులను కట్టడిచేసేందుకు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ స్పందించారు. ఈ చర్యను ఇంతటితో ఆపాలని, ఆందోళనకారులను ఆపడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్‌ వెంటనే జాతీయ ఛానల్‌లో ప్రకటన చేయాలని’ బైడెన్‌ ప్రకటన చేశారు. ఈ కాల్పుల ఘటనతో వాషింగ్టన్‌ మేయర్‌ బౌజర్‌ నగరంలో కర్ఫ్యూ విధించారు. ఈ వ్యవహారంలో ట్రంప్‌.. పైకి విచారం వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటున్నారు. క్యాపిటల్‌ భవనంలో అందరూ సంయమనం పాటించాలంటూ ట్రంప్‌ హితవు పలికారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. మొత్తానికి జనవరి 20న అధికారం నుంచి దిగిపోయే వరకూ ట్రంప్ ఇలాంటి పిచ్చి పనులు కొనసాగిస్తూనే ఉంటాడేమో..?