తొలి రోజు టీకా పంపిణీ విజయవంతం.. కేంద్రం ప్రకటన

భారత్‌లో చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. ఈ రోజు టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టంచేసింది. శనివారం 3351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది. అయితే, కొవిన్‌ యాప్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆలస్యమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలి రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా వేసినట్టు తెలిపింది.

టీకా పంపిణీ కార్యక్రమంపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. 3వేల మందికి పైగా సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్టు వెల్లడించింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమీక్షించారు. కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంతో ఉపశమనం లభించినట్లైందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఈ టీకాలు సంజీవనిలా దేశం ముందు నిలిచాయని తెలిపారు. కరోనా వైరస్‌కు టీకాలు రూపొందించడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, టీకా పరిశ్రమలు, ట్రయల్స్‌లో పాల్గొన్నవారు తదితరుల సహకారానికి అభినందనలు తెలిపారు.