క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం..

భారతదేశం క్షిపణి సాంకేతికత రంగంలో ఆత్మనిర్భరత సాధించిందని, ఈ రంగంలో భారత్‌పై ఇతర దేశాలు ఆధారపడే స్థితికి చేరుకున్నామని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కీలక పరిణామంలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సాధించిన కృషిని ఆయన అభినందించారు. క్షిపణి రంగంలో ఆత్మనిర్భరత సాధించడం, దేశ రక్షణలో కీలక పాత్ర వహించడమే గాక మన దేశానికి గర్వకారణంగా నిలిచిందని, స్వదేశీ సాంకేతికతతో ఇలా ముందుకెళ్లడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లోని డాక్టర్ అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఇదే ప్రాంగణంలో నిర్మించిన రెండు భవనాలను ఆయన ప్రారంభించారు. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను తిలకించారు.

2018లో క్షిపణి సాంకేతికత నియంత్రణ (ఎంటీసీఆర్)పై సంతకం చేయడానికి ముందు భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశాల క్షిపణి సాంకేతికతకు సంబంధించి, వినియోగానికి సంబంధించి ఎన్నో పరిమితులుండేవని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులను అవకాశాలుగా మలచుకుని స్వదేశీ తయారీ క్షిపణులను రూపొందిస్తున్న డీఆర్‌డీఓ చొరవ అభినందనీయమని తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తుల దిగుమతి దారు స్థాయి నుంచి, ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. ఈ దిశగా భారతదేశం మరింత ప్రగతిని సాధించేందుకు, భవిష్యత్ రక్షణ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక రక్షణ సాంకేతికత అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.

పరిశోధనలు, ప్రయోగాల తుది లక్ష్యం ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా మార్చడమేనన్న వెంకయ్యనాయుడు.. వాతావరణ మార్పులపైన మరిన్ని పరిశోధనలు జరగాలని సూచించారు. విజ్ఞాన శాస్త్రం సహా ప్రతి అంశం మాతృభాషలో ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. 12రోజుల వ్యవధిలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన ఢిల్లీలో కరోనా బాధితుల కోసం వెయ్యి పడకల దవాఖానను నిర్మించిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దేశం క్షిపణి రంగంలో ఇంత ప్రగతిని సాధించడంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పాత్ర చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డీఆర్‌డీఓ చైర్మన్ జీ సతీశ్ రెడ్డితోపాటు పలువురు డీఆర్‌డీఓ శాస్తవేత్తలు పాల్గొన్నారు.