ఖైరతాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు జనజీవితాలను అతలాకుతలం చేశాయి. హైదరాబాద్‌లో వందల సంఖ్యలో కాలనీలను నీటముంచింది. ఈ ఈ క్రమంలొ..  బాధితులకు మేమున్నామంటూ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు రెండురోజులుగా నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉద్ధృతంగా పర్యటిస్తూ బాధిత ప్రజలకు భరోసానిస్తున్నారు. గల్లీ గల్లీలో తిరుగుతూ ఆత్మీయ స్పర్శను అందించారు. మహానగరంలోని పలు కాలనీల్లో కలియదిరిగారు. ముంపునకు గురైన కాలనీల్లో అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులు విన్నవించిన సమస్యలను ఓపికగా విన్న మంత్రి వీలైన చోట అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. బురదనీటిలో నడుస్తూ.. ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ఇంకా వరదనీటిలోనే ఉన్న వారిని తక్షణమే ఆశ్రయ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. బాధితులందరినీ ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడకూడదని భరోసానిచ్చారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షణం తీరికలేకుండా తిరుగుతూ గులాబీ సైన్యానికి స్ఫూర్తినిచ్చారు.

ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్తా కాలనీలో కేటీఆర్ పర్యటించి.. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌ని కేటీఆర్ పరిశీలించి.. అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడటంతో.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ముంపు బాధితులందరికి రేషన్ బియ్యంతో పాటు ఇతర నిత్యవసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోరు వెచ్చని నీటిని తాగాలని ప్రజలకు కేటీఆర్ సూచించారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. షెల్టర్ హోమ్‌లో ఉంటున్న వారికి ఆహారంతో పాటు దుప్పట్లు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.