వైజాగ్ స్టీల్ కార్మిక నేతలతో జగన్.. ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవన్నారు. కేంద్రానికే సర్వాధికారాలు ఉన్నాయన్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం నాడు విశాఖకు వచ్చిన సీఎం జగన్‌ను కార్మిక సంఘాల ప్రతినిధులు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాదాపు 20 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని కేంద్రానికి లేఖ కూడా రాశామని చెప్పారు. ఇదే సమయంలో పోస్కో ప్రతినిధులు తనను కలిశారంటూ వస్తున్న వార్తలపైనా సీఎం స్పందించారు. పోస్కో ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి తనను కలిసిన మాట వాస్తవమే అని తెలిపిన సీఎం జగన్.. పోస్కో వాళ్లు విశాఖకు రావడానికి యత్నిస్తున్నారనడం మాత్రం అవాస్తవం అని స్పష్టం చేశారు. కడప, కృష్ణపట్నం, భావనపాడులాంటి ప్రాంతాల్లో ఫ్యాక్టరీని పెట్టాలని వారిని కోరినట్లు సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఎక్కడ పెట్టినా మరింత మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. దీనిపై పోస్కో ప్రతినిధులతో చర్చలు జరుపుతాం.

ఇదిలాఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే, ప్రధానికి తాను రాసిన లేఖను వక్రీకరించేందుకు యత్నిస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమస్యలకు పరిష్కారాలను లేఖలో వివరించామన్నారు. ఒక మార్గదర్శక ప్రణాళికను రూపొందించామన్నారు. దాదాపు రూ. 22వేల కోట్ల అప్పులు స్టీల్ ప్లాంట్‌కు ఉన్నాయన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేకపోవడం వల్ల ప్రతి టన్నుకు రూ. 4వేలు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. సమస్యలకు మార్గాలకు కూడా లేఖలో ప్రస్తావించామన్నారు. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలాని సీఎం తెలిపారు.