కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.. సోమవారం ఉదయం చెన్నైలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ఫొటోలతో సహా ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రెండో డోసును 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని వెంకయ్య తెలిపారు.

అర్హులైన వారందరూ కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకుని కొవిడ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వివిధ దేశాలకు మన దేశం నుంచి కరోనా వ్యాక్సిన్‌ సరఫరా అవుతుండటం భారతీయుడిగా గర్విస్తున్నన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యాక్సిన్‌ సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఆయన చెప్పారు.