హాథ్రస్‌ ఘటనలో మెడికో లీగల్‌ నివేదిక

హథ్రాస్‌ దుర్ఘటనకు సంబంధించి హత్యాచార ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదన్న పోలీసుల వాదనలకు భిన్నంగా మెడికో లీగల్‌ నివేదిక వచ్చింది. అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కళాశాల ఇచ్చిన నివేదిక బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు స్పష్టంగా పేర్కొంది. యువతిపై అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయాలతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించిందని యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్‌ కుమార్‌ గతంలో పేర్కొన్నారు. ఘటన జరిగిన 11 రోజుల తర్వాత నిర్వహించిన ఫోరెన్సిక్‌ పరీక్షల నివేదిక ఆధారంగా పోలీసులు ప్రకటన చేయటంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.