జనసేన టీడీపీల ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోతుంది

  • వందకు పైగా సీట్లలో వైసీపీకి డిపాజిట్లు గల్లంతే
  • జగన్ రెడ్డి పేపర్ చూస్తూ చదివే మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు
  • ముఖ్యమంత్రి మాయల్ని, మోసాల్ని, కుట్రల్ని, దళితులు, బీసీలు, ముస్లింలు కనిపెట్టారు
  • రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఘోరపరాజయం తప్పదు
  • పార్టీలో చేరిన యస్సి, యస్టీ, బీసీ మహిళలకు పార్టీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించిన నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: వైసీపీ పాలన కన్నా బ్రిటీష్ పాలనే నయమని ప్రజలు అనుకునే స్థాయికి వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలు పరాకాష్టకు చేరుకున్నాయని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు జనసేన, టీడీపీ కూటమికి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని ఆయన పేర్కొన్నారు. సోమవారం జనసేన పార్టీ 17వ డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు, మిద్దె నాగరాజుల ఆధ్వర్యంలో జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎత్తురోడ్డు ఆంజనేయస్వామి గుడి నుంచి నల్లచెరువు బొమ్మల సెంటర్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అడుగడుగునా మహిలు మంగళ హారతులతో పార్టీ శ్రేణులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కార్పొరేటర్లు లక్ష్మీ దుర్గ, పద్మావతిలతో కలిసి ఏటుకూరు రోడ్డు దర్గా మాన్యం సెంటర్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యస్సి, ఎస్టీ, ముస్లిం, బీసీ వర్గాలకు చెందిన యువకులు, మహిళలు పెద్దఎత్తున పార్టీలో చేరారు. వీరందరికీ నేరేళ్ళ సురేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయన్నారు. జనసేన టీడీపీ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.డబ్బులు పార్టీ పెట్టుకుంటుంది అని చెబుతున్నా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని దుస్థితిలో వైసీపీ ఉందని ఎద్దేవా చేశారు. వందకు పైగా సీట్లలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవంటూ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో వెన్నంటి నడిచిన దళితులను, ముస్లింలను, బీసీలను, కాపులను ఇంతగా దగా చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో లేడంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మోసాల్ని, కుట్రలను ప్రజలు గుర్తించారన్నారు. జగన్ రెడ్డి పేపర్ చూస్తూ చెప్పే విషపూరిత గుళికల్ని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గతంలో రికార్డు స్థాయిలో విజయాన్ని అందించిన ప్రజలే రానున్న ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయే పరాజయాన్ని వైసీపీకి ఇవ్వనున్నారని నేరేళ్ళ సురేష్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా, నగర కమిటీ సభ్యులు, వీరమహిళలు, డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.