అమరావతి, పోలవరంపై కేంద్రం మాట నిలబెట్టుకుంది

• కేంద్ర బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం
• బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం
• శ్రీ పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు పడ్డాయి
• జనసేన శాసనసభ పక్షం తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు
• అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేంద్ర బడ్జెట్ పై స్పందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు కేటాయించడం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించడంపై జనసేన పార్టీ శాసనసభ పక్షం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించి 2020లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఆ దిశగా అడుగులు పడటం శుభసూచకమన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్సీ శ్రీ పి. హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు శ్రీ పంతం నానాజీ గారు, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “రాష్ట్రం అభివృద్ధి చెందాలి… ప్రజలకు మేలు జరగాలి… మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2020 జనవరిలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వాన్ని కోరింది ఒక్కటే. ‘వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయి… స్వలాభం కోసం వాళ్లు అనుసరించే విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది, అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. దయచేసి పట్టించుకోండి’ అని ఆ రోజు కోరారు.
• మాట నిలబెట్టుకున్నారు
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత జరిగిన చర్చల్లో భాగంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అగ్ర నాయకత్వానికి… అమరావతి నిర్మాణానికి సాయం అందించాలి, రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపించింది అనే భావన కలగకుండా మనందరం కలిసి పని చేద్దామన్నారు. దీనికి కేంద్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వార్షిక బడ్జెట్ లో రాష్ట్రానికి మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో రాజధాని అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దడంతోపాటు ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా కృషి చేస్తాం. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అంకితభావంతో పని చేస్తామ”న్నారు.