9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తించనుంది. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతిని గత ప్రభుత్వాలు అవలంభించాయి. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని సీఎం కేసీఆర్ తెలిపారు.