ప్రారంభమైన భారత్‌ బంద్‌..

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను, ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ నేడు (మార్చి 26) చేపట్టదలిచిన భారత్‌ బంద్‌ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన భారత్‌ బంద్‌.. సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా బిజెపి మినహా మిగిలిన పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. కాగా, ఎన్‌డిఎలోని పలు పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. ఎక్కడికక్కడ విద్యార్థి, యవజన, మహిళా, కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. బార్‌అసోసియేషన్లు, బ్యాంకు, ఎల్‌ఐసి వంటి ఉద్యోగ సంఘాలు బంద్‌లో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపాయి. అంబులెన్స్‌ల వంటి అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు పెట్రోలు, డీజల్‌, గ్యాస్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా కూడా నిరసన తెలపాలని ప్రజానీకానికి పిలుపు నిచ్చారు. సంయుక్త కిసాన్‌మోర్చా నేత, ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ.. శుక్రవారం జరగనున్న బంద్‌ కొత్త చరిత్రను సృష్టిస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి ప్రజాగ్రహ స్థాయి స్పస్టంగా తెలుస్తుందని చెప్పారు. పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, తెలంగాణలలో రైతు మహాపంచా యతీలు నిర్వహించామని, వాటికి భారీ స్పందన లభించిందని తెలిపారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు పెద్ద ఎత్తున బంద్‌లో భాగస్వాములవు తున్నారని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులు, ప్రజానీకం పెద్ద ఎత్తున కదలనున్నారని తెలిపారు. రైతులు, కార్మికుల మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్యత వెల్లివిరుస్తోందని, భవిష్యత్‌లోనూ ఇది కొనసాగనుందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సిద్ధం..

బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో రవాణా రంగం స్థంభించనుంది. ఆర్‌టిసి బస్సులను నిలిపివేస్తు న్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, లారీలనూ నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. సుమారుగా 200కుపైగా సంఘాలు బంద్‌లో పాల్గొనున్నాయి. వర్తక, వాణిజ్య సంఘాలన్నీ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ కూడా బంద్‌లో భాగస్వామ్యం కానుంది. ఉదయం ఆరుగంటలకు విజయవాడ లో పిఎన్‌బిఎస్‌ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, న్యూడెమెక్రసీ, లిబరేషన్‌, ఎంఎల్‌, ఎంసిపిఐయు తదితర పార్టీల నాయ కులు పాల్గొననున్నారు. అనంతరం తొమ్మిది గంటలకు లెనిన్‌ సెంటర్లో జరిగే నిరసనలో పాల్గొంటారు. బంద్‌కు ఎన్‌జిఓ సంఘాలూ మద్దతు ప్రకటించాయి. తమ పరిధిలోని 94 ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటాయని ఎపి జెఎసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎపి జెఎసి ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసెఫ్‌ సుధీర్‌బాబు కూడా మద్దతు ప్రకటించారు.