లక్ష రూపాయల పింఛను సొమ్ముతో వాలంటీరు పరార్!

లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన సొమ్ముతో ఓ వాలంటీరు పరారయ్యాడు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలంలో జరిగిందీ ఘటన. ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ సచివాలయాలకు చెందిన కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆయా క్లస్టర్లకు చెందిన వాలంటీర్లకు శుక్రవారం డబ్బులు అందించారు. 43 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు బైరాపురం పంచాయతీకి చెందిన ఒకటో క్లస్టర్ వాలంటీరు మధుసూదన్‌రెడ్డి రూ. 1,05,500 తీసుకున్నాడు.

డబ్బులు తీసుకున్నప్పటికీ శనివారం సాయంత్రం వరకు డబ్బులు పంపిణీ కాకపోవడంతో లబ్దిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మధుసూదన్‌రెడ్డికి అధికారులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులను సంప్రదించగా ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుసూదన్‌రావు డబ్బులు తీసుకుని పరారైనట్టు ఈవోఆర్డీ నటరాజ్ ధ్రువీకరించారు.