నేను నాన్‌ లోకలా? మీరు ఏ గ్రహంలో ఉన్నారు: ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తాను లోకల్‌ కాదని వస్తున్న ఆరోపణలపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ”ప్రకాశ్‌ రాజ్‌ నాన్‌ లోకల్‌ అనే కొత్త ప్రచారం మొదలుపెట్టారు. నాన్‌ లోకల్‌ ప్రచారం చేస్తున్న వారు ఏ గ్రహంలో ఉన్నారో అర్ధం కావడం లేదు. కళాకారుడు అనే వాడు యూనివర్సల్‌. గత ఎన్నికల్లో నాన్‌ లోకల్‌ అనే ఎజెండా రాలేదు. నేను సామాజిక సేవ చేస్తున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. 7 నంది అవార్డులు వచ్చినప్పుడు, జాతీయ అవార్డు వచ్చినప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు.. అప్పుడు అనలేని నాన్‌ లోకల్‌ అనే మాట ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తుంటే మాత్రం ఎందుకంటున్నారు?” అని ప్రశ్నించాడు. మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌ చాలా బలమైన సంస్థ అని, ఇది కోపంతో పుట్టిన ‘సినిమా బిడ్డల’ ప్యానల్‌ కాదని, ఆవేదనతో పుట్టిందని అన్నారు. ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొన్నవాళ్లేనని చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడి తెలుగు వాళ్లు మన ఆర్టిస్టులకు బ్రహ్మరథం పడతారని, అది మనకు ఉన్న గౌరవం అని తెలిపారు. సీనీ కార్మికల సమస్యల పరిష్కారం కోసమే తాను అధ్యక్ష బరిలోకి దిగుతున్నానని, తన ప్యానల్లోని సభ్యులంతా స్వయం కృషితో పైకి వచ్చినవారేనని చెప్పారు. తాను అడిగానని కాకుండా.. అర్హత చూసి ఓటు వేయండని కోరారు.