Panjshirను తాలిబన్లు వశం చేసుకోవడం అబద్ధం: అహ్మద్‌ మసూద్‌

ఆఫ్గనిస్తాన్‌లో పంజ్‌షీర్‌ను ఆక్రమించుకున్నామని తాలిబన్లు చేసుకున్న సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం ఆఫ్గాన్‌లో తాలిబన్లు గాలిలోకి అనేక మార్లు తుపాకులను పేల్చడంతో సుమారు 17 మంది చనిపోగా…41 మంది గాయపడ్డారు. దీనిపై తాలిబన్లు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఇది ఓ సంప్రదాయమని తెలుస్తోంది. ఆగస్టు 31న అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న సమయంలో కూడా వారు ఇలానే గాల్లోకి కాల్పులు జరిపారని సమాచారం. కాగా, ఆప్గాన్‌లో తాలిబన్లు ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. వీరికి పంజ్‌షీర్‌ కొరకరాని కొయ్యగా మారింది.
అయితే దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. పంజ్‌షీర్‌ కోసం వ్యతిరేకులతో యుద్ధం సాగిస్తున్నాయి. అయితే శుక్రవారం రాత్రి పంజ్‌షీర్‌ను ఆక్రమించుకున్నట్లు తాలిబన్‌ ప్రతినిధి తెలుపగా… ఉత్తర కూటమి సేనలు ఖండిస్తున్నాయి. పంజ్‌షీర్‌ తమ ఆధీనంలో ఉందని పేర్కొన్నాయి. సైనిక కమాండర్‌ అహ్మద్‌ మసూద్‌, అమరుల్లా నలేహ్ ఈ వార్తను ఖండిచారు. పంజ్‌షీర్‌ ఆక్రమణల వార్తలు పాక్‌ మీడియాలో ప్రసారమౌతున్నాయని, ఇదంతా అబద్ధమని పంజ్‌షీర్‌ను వశం చేసుకోవడమంటే..అది తనకు చివరి రోజు అని మసూద్‌ ట్వీట్‌ చేశారు. తాము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామనడానికి సందేహమేమీ లేదని, తాలిబన్లతో యుద్ధం సాగుతోందని నల్లేహ్ చెప్పారు.