మొదలైన Bharat Bandh .. ఢిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే దిగ్బంధం

కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా తలపెట్టిన భారత్‌ బంద్‌ సోమవారం మొదలైంది. సోమవారం ఉదయం 6గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భారత్‌ బంద్‌ జరగనుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా… దాని అనుబంధంగా ఉన్న 40 రైతు సంఘాలు జాతీయ సమ్మెను చేపడుతున్నాయి. అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా బంద్‌ చేపడతామని ఇప్పటికే కిసాన్‌ మోర్చా ప్రకటించింది. సోమవారం ఉదయం ఘాజిపూర్‌ సమీపంలోని ఢిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను దిగ్భందించడంతో ఉత్తరప్రదేశ్‌ నుండి ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావితం చూపుతోంది. పంజాబ్‌, హర్యానాల మధ్య ఉన్న శంభు రహదారిని కూడా రైతన్నలు దిగ్బంధించారు. బంద్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడ్డాయని ఎస్‌కెఎం తెలిపింది.
రైతులు చేపడుతున్న బంద్‌కు మద్దతునివ్వాలని పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్దు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతియుత బంద్‌కు మద్దతునిస్తున్నట్లు బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేత మాయావతి అన్నారు. కార్యకర్తలు, రాష్ట్ర చీఫ్‌లు, ప్రతి ఒక్కరు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.  ఆర్జేడీ నేతలు బంద్ కు మద్దతునిస్తూ.. బీహార్లోని హాజీపూర్ నిరసనల్లో పాల్గొన్నారు.