ప్రశాంతంగా ముగిసిన రైతన్నల ‘చక్కా జామ్‌’

నూతన సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్‌ ప్రశాంతంగా ముగిసింది. పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బెంగళూరు, పుణె, ఢిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులు నేడు తమ పోరాటంలో భాగంగా చక్కా జామ్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సాగిన ఈ రాస్తారోకో కార్యక్రమంలో పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పలు చోట్ల రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. బెంగళూరులోని యలహంక పోలీస్‌ స్టేషన్‌ బయట ఆందోళన చేస్తున్న రైతు మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని షాహీదీ పార్క్‌ వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వదిలేశారు.