నిరాడంబరంగా మలాలా నిఖా..

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జారు వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని24 ఏళ్ల మలాలా స్వయంగా వెల్లడించారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో గల తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ”ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం” అని మలాలా ట్వీట్‌ చేశారు. భర్త అస్సర్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. పాకిస్తాన్‌లోని స్వాత్‌ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్య కోసం పోరాటం చేశారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో మలాలాకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే బుల్లెట్‌ గాయాలకారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. ఇక అప్పటి నుంచి మలాలా బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్‌ పేరుతో బాలికల విద్యకోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలో తన సేవలను గుర్తించిన నోబెల్‌ కమిటీ 2014లో మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతిని అందించింది. దీంతో 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మాలాలా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.