రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు అదనపు బాధ్యతలు

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్​కు అదనపు మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాశ్వాన్‌ హఠాన్మరణంతో ఆయన శాఖలను పీయూష్ గోయల్‌కు కేటాయించారు. పాశ్వాన్ నేతృత్వం వహించిన ఆహార, ప్రజా పంపిణీ శాఖలను ఇక నుంచి పీయూష్ గోయల్ పర్యవేక్షణ చేయనున్నారు. ప్రధాని మోడి సలహా మేరకు గోయల్‌కు అదనపు బాధ్యలిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్‌ శుక్రవారం వెల్లడించింది.

కాగా లోక్‌జనశక్తి పార్టీని స్థాపించిన రామ్‌విలాస్ పాశ్వాన్‌.. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వివిధ పార్టీ నేతలతో ఆయన మంచి సంబంధాలను పెంచుకున్నారు. జనతాదళ్‌, కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాల్లో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.