రైతులకు మద్దతుగా తేజస్వి యాదవ్‌.. ఉరికంభానికైనా రెడీ

రోజు రోజుకూ రైతు నిరసనలకు పెద్ద యెత్తున మద్దతు లభిస్తోంది. దేశ విదేశాల నేతల నుండి విపక్షాల వరకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌ స్పందించారు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ మహా కూటమి నేతలతో కలిసి నిరసనల్లో పాల్గొన్న ఆయన.. ధైర్యముంటే తనను అరెస్టు చేయాలంటూ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు సవాలు విసిరారు. దీంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై తేజస్విపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు కావడాన్ని తప్పుబట్టిన ఆయన నితీష్‌ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పిరికిపంద చర్యలకు దిగుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల కోసం ఉరికంభం ఎక్కేందుకైనా తాను రెడీ అంటూ వ్యాఖ్యానించారు.

రైతులకు మద్దతుగా పోరాడుతున్న తమపై పిరికిపంద నేతృత్వంలోని ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, నిజంగా అధికారమనేది మీ చేతిలో ఉంటే తనను అరెస్టు చేయాలని, లేదంటే తానే లొంగిపోతానని, రైతుల కోసం ఉరికంభం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నానని ట్వీట్‌ చేశారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్న తమ నేతపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ఆర్జేడీ మండిపడింది.