నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ సాగింది. మున్సిపల్‌ కౌన్సిలర్లు, నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ సభ్యులు ఓటు వేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో 99.64 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. మొత్తం 824 ఓట్లకు గానూ 821 ఓట్లు పోలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 341 ఓట్లు ఉండగా, మొత్తం ఓట్లు పోలవడంతో అక్కడ 100 శాతం పోలింగ్ నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 483 ఓట్లకు గానూ 480 ఓట్లు పోలయ్యాయి. మిగతా మూడు ఓట్లలో.. ఇద్దరు ఓటర్లు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక మిగిలిన ఒక ఓటరు నెల రోజుల క్రితం మృతి చెందాడు. చనిపోయిన ఓటరు భోదన్ కౌన్సిలర్‌గా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.