‘సూపర్ మ్యాన్’ గా భావిస్తున్నా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రాథమిక కోవిడ్-19 చికిత్స తరువాత తాను ఒక “సూపర్ మ్యాన్”గా భావించానని మరియు 216,000 మంది అమెరికన్ల ప్రాణాలను తీసిన ఈ వ్యాధికి తన రోగనిరోధక శక్తి గురించి గొప్పగా చెప్పుకున్నారు.  

కరోనా నుంచి కోలుకున్న ఆయన పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు, తన రోగనిరోధక శక్తి గురించి గొప్పగా చెప్పుకున్నారు. ‘నేను ఏదో తీసుకున్నాను. అది ఏదైనా కావొచ్చు. కానీ, నేను త్వరగా కోలుకున్నా. నాకు నేను సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తోంది. మన వద్ద గొప్ప వైద్యులు ఉన్నారు. నాకు వైద్యం అందించిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నాకు రోగ నిరోధకత ఉందని వారు చెప్పారు. ఇప్పుడు నేను కిందికి దిగి ఆడా, మగా అందరినీ ముద్దాడగలను’ అంటూ సరదాగా మాట్లాడారు.  కరోనా నుంచి కోలుకున్న తరవాత ట్రంప్ పాల్గొన్న రెండో ఎన్నికల ప్రచారం ఇది.

ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికలో సరైన వ్యక్తిని ఎంచుకోవటం చాలా సులభమని ట్రంప్‌ అన్నారు. తన ప్రత్యర్థి జో బైడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్టేనని.. అదే తాను గెలిస్తే అమెరికా గెలిచినట్లనే కొత్త వాదనతో ముందుకొచ్చారు. ఇక నిర్ణయం మీదేనంటూ పెన్సిల్వేనియాలోని జోన్స్‌టౌన్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.