తెలుగు రాష్ట్రాల్లో మొదలైన కార్తీకమాసం సందడి

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం సందడి ప్రారంభమైంది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. పలు దేవాలయాల్లో కరోనా నిబంధనలను అనుసరించి, భక్తులకు దర్శనాలను కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రముఖ శైవక్షేత్రాలైన వారణాసి, శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తితో పాటు వేములవాడ రాజరాజేశ్వస్వామి ఆలయాలతో పాటు త్రిలింగ క్షేత్రాలు, పంచారామాలు సహా అన్ని శివాలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని.. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు.

కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సమీప ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నదిలో దీపాలను వదిలారు విజయవాడలో కృష్ణా ఘాట్, భవానీ ఘాట్, రాజమండ్రిలోని స్నానాల ఘాట్, శ్రీ శైలంలోని పాతాళగంగ వద్ద స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని అలంపురం వద్ద కూడా అధికారులు భక్తుల స్నానాలకు ఏర్పాట్లు చేశారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం నుంచి నిత్యం సాయంత్రం గోదావరి నదీహారతి కార్యక్రమం కనుల పండువగా జరుగనుంది.

ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ సాధారణ స్థాయితో పోలిస్తే తక్కువగానే ఉంది. ముందుగా అనుమతి తీసుకున్న భక్తులను, వీఐపీలనూ అనుమతిస్తుండగా, చిన్న దేవాలయాల్లో కొవిడ్ నిబంధనలు కనిపించడం లేదని తెలుస్తోంది.