మారిశెట్టి శ్రీనివాసరావుపై దాడిని ఖండించిన జనసేన నాయకులు

గుంటూరు, అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుతో కలిసి అక్రమ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టడాన్ని ఓర్చుకోలేక మనస్థాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి చెందిన మారిశెట్టి శ్రీనివాసరావు అను జనసేన కార్యకర్తను బోనబోయిన శ్రీనివాసరావు పరామర్శించారు. తప్పుడు కేసు బనాయించి అతన్ని, అతని కుటుంబాన్ని మానసికంగా ఒత్తిడికి గురిజేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడంటే అధికార పార్టీ నేతల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని ఆయన అన్నారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి తప్ప భౌతిక దాడులు చేయడం హేయమని అన్నారు. మారిశెట్టి శ్రీనివాసరావు పై అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఒక పథకం ప్రకారం తమ పార్టీకి చెందిన దళిత యువకులను ప్రోత్సహించి భౌతిక దాడి చేయించడమే కాక తిరిగి దెబ్బలు తిన్న వ్యక్తి పైన కేసు పెట్టి పోలీసులు ద్వారా ఒత్తిడి తేవడంతో శ్రీనివాసరావు భయంతో పురుగుమందు తాగి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానం అవాంఛనీయమని వారు అన్నారు. కొంతమంది దళిత కుటుంబాలకు చెందిన యువకులు ఇటువంటి కుట్రలకు పావులుగా మారవద్దని, సామాజిక న్యాయం కోసం పోరాడి అన్ని రకాలుగా వెనుకబడిన తమ జాతి అభ్యున్నతికి పాటుపడాలని, అందుకు జనసేన పార్టీ సరైన వేదిక అని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాక్షాత్తు మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గంలో ఇటువంటి దుశ్చర్యలు పదే పదే జరుగుతుండడం దురదృష్టకరమని, ఇప్పటికైనా మంత్రిగారు మేల్కొని మంచి పనులపై దృష్టి పెట్టాలని అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన పార్టీ తరఫున ప్రజా ఉద్యమాలకు సైతం వెనుకాడబోమని అన్నారు. మారిశెట్టి శ్రీనివాసరావు సేవించిన గడ్డి మందు చాలా ప్రమాదకరమైనదని, అతని ప్రాణానికి ఎటువంటి ముప్పు వాటిల్లిన వైసిపి నేతలు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అనంతరం రూరల్ సిఐని కలసి కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. మారిశెట్టి శ్రీనివాసరావుపై భౌతిక దాడి చేసిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నారాదాసు ప్రసాదు, జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య, నాదెండ్ల నాగేశ్వరరావు, సిరిగిరి పవన్ కుమార్, తాడువాయి లక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, పార్టీ కార్యాలయం ఇన్చార్జ్ సిరిగిరి మణికంఠ, వల్లెం శ్రీనివాసరావు, పలువురు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.