2021 తొలి 4 నెలల్లోగా 30 కోట్ల మంది దేశ ప్రజలకు టీకా

2021 తొలి మూడు లేదా నాలుగు నెలల్లో దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించగలమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఇవాళ ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూలై లేదా ఆగస్టు కల్లా.. సుమారు 25 నుంచి 30 కోట్ల మంది భారతీయులకు కోవిడ్ టీకాను అందించగలమని వెల్లడించారు. అయితే ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి హర్షవర్దన్ తెలిపారు. కోవిడ్ ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన అభ్యర్థించారు. కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఆరోగ్య రక్షణ కోసం ఇవి కచ్చితమైన చర్యలు అని ఆయన అన్నారు.