నేరేడ్‌మెట్‌ డివిజన్‌ కౌంటింగ్‌పై హైకోర్టు తీర్పు

నేరేడ్‌మెట్ ఎన్నికల ఉత్కంఠకు తెర పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా నిలచిపోయిన నెరేడ్‌మెట్ డివిజన్‌ కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతినిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈనెల 4న అక్కడ వివాదాస్పదంగా మారిన ఇతర ముద్ర ఉన్న ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోని లెక్కించాలని ఆదేశించింది. కోర్టు గత ఆదేశాల మేరకు కౌంటింగ్‌ నిలిచిపోయే సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 504 ఓట్ల మెజార్టీతో ఉండగా.. ఇతర ముద్ర ఉన్న గుర్తు ఓట్లు 544 గా నమోదయ్యాయి. తాజాగా కౌంటింగ్‌కు లైన్‌ క్లియర్‌ కావడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.

స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కౌంటింగ్‌కు కొద్ది గంటల ముందు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వస్తిక్ గుర్తు ఉన్నవాటిని మాత్రమే పరిగణంలోకి తీసుకునేలా చూడాలని బీజేపీ నేతలు కోరారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పూర్తి తీర్పును వెల్లడించింది.