సీరం వ్యాక్సిన్ డోసు 250 రూపాయలకే

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీ, ఆస్ట్రాజెనెకా సాయంతో తయారు చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సిన్ ఒక డోసును ధర 250గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రంతో సప్లై కాంట్రాక్టును కుదుర్చు కునే సూచనలు ఉన్నాయి. తమ టీకామందును అత్యవసర వినియోగానికి అనుమతించవలసిందిగా ఈ కంపెనీ అప్పుడే లాంఛనంగా రెగ్యులేటరీ సంస్థలకు దరఖాస్తు పెట్టుకుంది. తమ టీకా దేశంలోని ప్రైవేట్ మార్కెట్ లో ఒక డోసు వెయ్యి రూపాయలు ఉండవచ్ఛునని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ఇటీవల ప్రకటించారు. అయితే ప్రభుత్వం హెచ్చు స్థాయిలో కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ని సరఫరా చేసే అవకాశం ఉంది.

సీరం వైపే కేంద్రం

భారత్ లో ఫార్మా దిగ్గజాలు తమ కరోనా వ్యాక్సిన్ ను విక్రయించేందుకు ముందుకు వస్తున్నా.. కేంద్రం మాత్రం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీ, ఆస్ట్రాజెనెకా సాయంతో తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్‌ డోసులు తయారుచేస్తున్న సంస్ధగా గుర్తింపు ఉంది. అందుకే ఇతర ఫార్మా సంస్థల కంటే తమకే ఈ కాంట్రాక్టు దక్కుతుందని సీరం భావిస్తోంది. అయితే భారత్‌లో ముందుగా వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభించాలని, ఆ తర్వాతే ఇతర దేశాలకు విక్రయిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో ఆధర్‌ పూనావాలా తాజాగా ప్రకటించారు.