వాజ్‌పేయి ఎందరికో ఆదర్శం: ఉపరాష్ట్రపతి

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఓ సముద్రం లాంటి వారని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయడు అన్నారు. సికింద్రాబాద్‌ మారియట్‌ హోటల్‌లో వాజ్‌పేయీ మెమోరియల్‌ సదస్సులో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలన అందించిన వాజ్‌పేయీ ఎందరికో ఆదర్శనీయమన్నారు. ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలతో దేశ రూపురేఖలు మార్చారని కొనియాడారు. ఆర్థిక సంస్కరణల అమలును ఎంతో వేగవంతం చేశారని ప్రశంసించారు. వాజ్‌పేయీ తన భావాలను కవితల రూపంలో వెల్లడించేవారని అన్నారు. ఆయన నుంచి నేటి యువతరం ఎంతో నేర్చుకోవాలని.. ఆయన వ్యక్తిత్వం, ధైర్యం, సామర్థ్యం స్ఫూర్తిదాయకం అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అద్భుతమైన ప్రసంగాలు చేశారని కొనియాడారు. సమాజంలో వేగంగా మార్పులు రావాలని ఆయన కోరుకునేవారని.. పోఖ్రాన్‌-2 పరీక్షలతో భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచారని వెంకయ్యనాయుడు తెలిపారు.