నరకప్రాయంగా మారిన వీధి కుక్కల స్వైర విహారం

గుంటూరు: అంబర్ పేటలో వీధి కుక్కలు నాలుగేళ్ళ బాలుడిని పీక్కుతిన్న సంఘటన నేపధ్యంలో అన్నా గుంటూరు నగరంలో వీధి కుక్కల నిర్మూలనకు నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి అన్నారు. మంగళవారం వీధికుక్కల స్వైర విహారంపై ఆయన విలేకరుల సమావేశంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలో ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు సంచరిస్తూ పాద చారులను, ద్విచక్రవాహననంపై ప్రయాణించేవారిని వెంటపడి కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు బయటికి రావటానికే భయపడుతున్నారన్నారు. ప్రతీరోజూ ఎంతోమంది వీధి కుక్కల కాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీధి కుక్కల విషయమై ఎన్నిమార్లు అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, గడప గడపకు విచ్చేసిన శాసనసభ్యులకు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా ఉందని ధ్వజమెత్తారు. నగరపాలక సంస్థకు ప్రజల నుంచి ఎన్నో ఫిర్యాదులు అందుతున్నా అధికారులు సైతం ఇంతవరకు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా వీధి కుక్కలకు సంతానోత్పత్తి నిర్మూలన ఇంజక్షన్లు ఇవ్వటం, యానిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయటం వంటి చర్యలు తీసుకొవాలన్నారు. అంబర్ పేట సంఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కలను నిర్మూలనకై నగరపాలక సంస్థ కమీషనర్, మేయర్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆళ్ళ హరి కోరారు.