ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు..

దేశంలోని కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 70 శాతం పాజిటివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 153 యూకే తరహా కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు.

అదేవిధంగా దేశంలోని 147 జిల్లాల్లో గత వారం రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా కొత్తగా నమోదకాలేదని చెప్పారు. మరో 18 జిల్లాల్లో గత 14 రోజులుగా, 6 జిల్లాల్లో గత 21 రోజులుగా, 21 జిల్లాల్లో గత 28 రోజులుగా మహమ్మారికి సంబంధించిన పాజిటివ్‌ కేసులు నమోదుకాలేదని వెల్లడించారు.

దేశంలో గత 24 గంటల్లో 11,666 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,07,01,193కు పెరిగింది. ఇందులో 1,03,73,606 మంది వైరస్‌ బారినుంచి కోలుకోగా, 1,73,740 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 1,53,847 మంది మృతి చెందారు. కాగా, కొత్తగా 14,301 మంది బాధితులు డిశ్చార్జీకాగా, 123 మంది కొత్తగా మరణించారు.