కిడ్నీ వ్యాధి సమస్యలపై ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించిన అఖిలపక్ష నేతలు

ఏ. కొండూరు మండలంలో దశాబ్ధకాలంగా విలయతాండవంచేస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యలపై ప్రత్యక్ష పోరాటాన్ని అఖిలపక్షనాయకులు ప్రారంభించారు.. చీమలపాడుమెయిన్ రోడ్డు సెంటర్ వద్ద గురువారం కిడ్నీ వ్వాధి భాధితుల సమస్యల సాధన పోరాట సమితి పేరుతో అఖిలపక్ష నేతలు రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు.. ఈ నిరాహారదీక్షా శిభిరంలో దీక్షలో పాల్గోన్న క్రిష్ణా జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దశాబ్ధ కాలంగా ఏ. కొండూరు మండలాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యల పరిష్కారంకోరుతూ.. నేడు ప్రత్యక్షపోరాటానికి దిగటం జరిగిందని ఆయన అన్నారు. ఏ. కొండూరు మండలంలో ఏగడపను కదిలించినా కిడ్నీ వ్యాధి భాధితులేనని, ఇటీవలకాలంలో కిడ్నీ వ్యాధితో మరణాలు అధికమయ్యాయని ఆయన అన్నారు. గతంలో జనసేనపార్టీ ఆధ్వర్యం కిడ్నీ వైద్యనిపుణులతో చాలా వైద్యశిభిరాలు ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన అన్నారు. కిడ్నీ బాధితులు అధికంగా ఉన్న ఏ. కొండూరు మండలానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రధాన మంత్రి డయాలసిస్ ప్రోగ్రాం కింద కేటాయించిన డయాలసిస్ సెంటర్ ను నియోజకవర్గ కేంద్రమైన తిరువూరులో ఏర్పాటు చేయడాన్ని మండల ప్రజలు అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. బాధితులు అధికంగా ఉన్న చోటఉండాల్సిన డయాలసిస్ సెంటర్ ను బాధితులు లేని వేరే చోటుకి తరలించడాన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుందని ఆయన అన్నారు. తక్షణం అధికారులు స్పందించి ఏ. కొండూరు మండలానికి కేటాయించిన డయాలసిస్ సెంటర్ ను ఏ. కొండూరు మండలంలోనే ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల మొత్తానికి రక్షిత తాగునీరు క్రిష్ణా జలాలను వెంటనే అందజేయాలని, కిడ్నీ బాధితులను గుర్తించి తక్షణం వారికి వైద్య సేవలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో సి.పి.ఎం మండల కార్యదర్శి మేకల్ డేవిడ్, టి.డి.పి విజయవాడ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, బీఎస్పీ నాయకులు కోటేశ్వరరావు, బిజెపి నాయకులు యస్ సురేంద్ర నాధ్, భరత్ పీక్లా నాయక్, వంశీ తదితరులు దీక్షలో కూర్చున్నారు. టి.డి.పి ఏ. కొండూరు మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, బెజవాడ శంకర్, గంపలగూడెం జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, విసన్నపేట మండల అధ్యక్షుడు షేక్ యాసిన్, తిరువూరు మండల అధ్యక్షులు పర్సా పుల్లారావు, టౌన్ నాయకులు ఉయ్యూరు జయ ప్రకాష్, వల్లారపు పూర్ణ, విశ్వనాథం, అడపా శీను, సతీష్, ఏ కొండూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం ప్రకటించారు.