త్వరలో అమరిందర్‌ కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చేసిన పంజాబ్ మాజీ సీఎం

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీలో చేరబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ఆయన.. సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రంలో జరిగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని కూడా ఆయన స్పష్టంచేశారు. బీజేపీ, అకాలీ చీలిక వర్గంతో సీట్ల సర్దుబాటు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. గత నెల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిసిన అమరీందర్ సింగ్.. బీజేపీలో చేరబోనని అప్పట్లోనే ప్రకటన చేశారు. రైతుల నిరసనలపై హోం మంత్రి అమిత్ షాతో చర్చించినట్లు తెలిపారు.

పంజాబ్ శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆందోళన చేస్తున్న రైతుల సంక్షేమం కోసం తమ కొత్త పార్టీ పనిచేస్తుందని అమరీందర్ సింగ్ మీడియా సలహాదారుడు రవీన్ తుక్రాల్ వరుస ట్వీట్స్ చేశారు.

అధికారికంగా అమరీంధర్ సింగ్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం తాజా పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ, అకాలీ దళ్‌తో కెప్టెన్ చేతులు కలిపారని తాను ముందే చెప్పానని పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ అజెండా కెప్టెన్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.