ట్రంప్‌ నిర్ణయంతో భారీ సంక్షోభం నుంచి గట్టెక్కిన అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన మొండివైఖరిని వీడి.. అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన భారీ కరోనా వైరస్ రిలీఫ్ అండ్ ప్రభుత్వ నిధుల ప్యాకేజీ బిల్లుపై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది. భారీ సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కింది. నిన్నటి వరకు సంతకం చేసేది లేదంటూ మొండికేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ అధికార పగ్గాలు చేపట్టే వరకు తీవ్ర ఆర్థిక కష్టాలు తప్పవని భావించారు. కానీ, ట్రంప్‌ మనసు మార్చుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రంప్‌ ఈ బిల్లుపై సంతకం చేయడంతో నిరుద్యోగ ప్రాయోజిత పథకాల కింద దాదాపు 95 లక్షల మంది అమెరికన్లు లబ్ధి పొందనున్నారు.

మొత్తానికి అమెరికా మరోసారి నిరుద్యోగ సంక్షోభంలోకి వెళ్లకుండా ఈ సంతకం అడ్డుకున్నట్లైంది. ఈ పథకం కింద నిరుద్యోగులకు అందుతున్న తోడ్పాటు మరో 11 వారాలు కొనసాగనుంది. కరోనా సృష్టించిన విలయంతో భారీగా నష్టపోయిన అమెరికన్లకు ఆర్థిక సహాయం అందించాలన్న ప్రతిపాదనతో 900 బిలియన్‌ డాలర్ల(సుమారు 66.37 లక్షల కోట్లు) ప్యాకేజీతో కూడిన బిల్లును ఉభయ సభలు గతంలోనే ఆమోదించాయి. కానీ, అనూహ్యంగా ట్రంప్‌ దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. చిన్న వ్యాపారులకు, పౌరులకు 600 డాలర్ల(రూ.44వేలు) ఆర్థిక సహాయం సరిపోదని, దాన్ని రెండు వేల డాలర్ల(రూ.1.47లక్షలు)కు పెంచాలంటూ అమలుకు సాధ్యంకాని సూచనలిస్తూ వచ్చారు. దాంతో అమెరికావ్యాప్తంగా నిరుద్యోగ ప్రజలు టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్లు వారికి చాలా అవసరం. ఈ ప్యాకేజీ వారికి చాలా కీలకం. ట్రంప్ సంతకం పెట్టకపోయి ఉంటే… లేనిపోని తలనొప్పులు వచ్చేవి. అమెరికాలో నిరుద్యోగ సమస్య కుంపట్లు రాజేసేది. ఈ బిల్లుపై కొన్ని రోజులుగా ట్రంప్ సంతకం పెట్టకుండా నాన్చుతూ వచ్చారు. శనివారంతో బిల్లు డెడ్ లైన్ ముగిసింది. ట్రంప్ సంతకం పెట్టకపోయి ఉంటే 1.40 కోట్ల మంది నిరుద్యోగ బీమా (unemployment insurance) కోల్పోయేవారు. సంతకం పెట్టడం వల్ల… వారంతా మార్చి వరకూ… ఉద్యోగాలు లేకపోయినా… ప్రతి వారం నిరుద్యోగ భృతి పొందగలరు.