అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న అమీబా

ఇప్పటికే కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు అమెరికా వైద్య ఆరోగ్యశాఖ మరో పిడుగులాంటి వార్త వినిపించింది. ఇప్పుడు అమెరికాలో ఓ కొత్తరోగం మొదలైంది. మనిషి మెదడును తినే ఓ అమీబాను అమెరికాలోని స్థానిక నీటి సరఫరా వ్యవస్థలో గుర్తించారు టెక్సాస్‌ అధికారులు. ఇది మహా డేంజర్‌! ఇప్పటికే ఈ రూపంలేని బ్యాక్టిరియా కారణంగా ఓ చిన్నారిని బలిగొంది.

జోసియా మైక్‌ ఇంటైర్‌ అనే ఆ బాలుడు కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు.. ఆ వెంటనే కన్నుమూశాడు.. మైక్‌ ఇంటైర్‌ను పరీక్షించిన డాక్టర్లు అతడి తలలో అరుదైన మెదడును తినేసే అమీబాను గుర్తించారు. జాక్సన్‌ సరస్సులోని నీటిని పరీక్షించిన నిపుణులు అందులో మెదడును తినే అమీబా చేరినట్టు గుర్తించారు. బహుశా మైక్‌ ఇంటైర్‌ ఈ నీటితో ఆడి ఉండవచ్చు.. లేదా తాగి ఉండవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు.. ఇలాంటి బ్యాక్టిరియా ఉన్న నీటిని తాగినప్పుడు అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళుతుంది.. ఆ తర్వాత మెదడును తినడం మొదలుపెడుతుంది. టైమ్‌కు చికిత్స అందించకపోతే మరణం తప్పదంటున్నారు వైద్యులు. విపత్తును గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు.. ప్రజలెవ్వరూ కుళాయి నీళ్లు తాగకూడదని, ఆ నీటితో వంట కూడా చేయవద్దని హెచ్చరించారు.. ఇవి కాకుండా ఇతర అవసరాలకు నీటిని వాడుకోవాలంటే మాత్రం కాసేపు నల్లాలను ఓపెన్‌ చేసి ఉండాలని చెప్పారు. తప్పదనుకుంటే మాత్రం నీటిని బాగా వేడి చేసిన తర్వాతే తాగాలని సూచించారు. ఇలాంటి అమీబా ఎక్కువగా వెచ్చని సరస్సులు, నదులలో ఉంటుంది.. ఇలాంటి సరస్సులలో ఈత కొడితే అమీబా శరీరంలో చొరపడే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టిరియా కణజాలాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలు:

ఈ వింతరోగం వస్తే ఆరంభంలో తలనొప్పి, జ్వరం వస్తాయి. ఆ తర్వాత క్రమేసి వాంతులు జ్వరం రావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. వ్యాధి ముదిరితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. టెక్సాస్తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా అపరిశుభ్ర నీటిని తాగొద్దని.. క్లోరినేషన్ చేశాకే నీటిని వినియోగించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.