జనసేనాని మద్దతు కోరిన అమరావతి రైతులు

• చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమే
• అమరావతి సాధించుకునే వరకు మాకు మద్దతివ్వండి
• విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షలో అమరావతి మహిళా రైతులు

ప్రజా సమస్యల పట్ల రాష్ట్రప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది లేదనీ, చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని అమరావతి రాజధాని ప్రాంత మహిళా రైతులు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి విషయంలోగానీ, విశాఖ ఉక్కు పరిరక్షణ అంశంలోగాని ఒకే మాట మీద నిలబడిన నాయకుడు ఆయనేనన్నారు. రాజధాని కోసం రైతులు చేపడుతున్న పాదయాత్రలో పాల్గొనాలని, ముగింపు రోజు బహిరంగ సభకు హాజరవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు అమరావతి రైతులు, మహిళలు సంఘీభావం తెలిపారు. రాజధాని పరిరక్షణ సమితి, రాజధాని రైతుల పక్షాన శ్రీమతి ఆకుల జయసత్య, శ్రీమతి రాధి, శ్రీమతి శైలజ, శ్రీమతి బత్తుల గంగాభవా తదితరులు దీక్షకు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత మహిళలు మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటను మేము వింటాం. మా గుండెల్లో ఉన్న బాధ ఆయన మాటల రూపంలో బయటకు వస్తుంది. తెలుగు వారికి అన్యాయం జరుగుతోంది. రాజధాని లేని రాష్ట్రానికి భూములిచ్చి మేము బుగ్గి పాలయ్యాం. మా గురించి కొందరు మాట్లాడుతున్న మాటలు వింటుంటే మా గుండెలు అవిసిపోతున్నాయి. మొదటి నుంచి మాకు భరోసా ఇస్తూ వెన్నెముకగా ఉన్నారన్న ధైర్యంతో మీ దగ్గరకు వచ్చాం. శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమే వేషధారణ లేని నాయకులు. వేషాలు వేసే నాయకులు.. ఎన్నో మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు. రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పి మోసగించారు. సమస్యల మీద శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ ఒకటే మాట. అమరావతి రాజధాని రైతులకు అండగా ఉంటానన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్ని నినదించారు. ఏ స్త్రీకి అన్యాయం జరిగినా అండగా ఉంటానని చెప్పిన మీకు కృతజ్ఞతలు. స్త్రీ జాతికి అడుగడుగునా అవమానం జరుగుతున్న రోజుల్లో మా ఆత్మాభిమానం పోయినప్పుడు అండగా నిలచిన శ్రీ పవన్ కళ్యాణ్ కి మా విన్నపం ఒకటే. ఒక రాష్ట్రం ఒకటే రాజధాని నినాదానికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. పాదయాత్ర చివరి ఘట్టంలో మీరు పాల్గొంటే మాకు వెన్నెముకగా నిలిచినట్టుంటుంది. అమరావతిని సాధించుకునే వరకు మాకు అండగా నిలవండి. మాకు మీ అండ కావాలి. ఈ నెల 17వ తేదీన పాదయాత్ర ముగింపు సభకు మద్దతు ఇవ్వాలి” అని కోరారు.