అన్నాడిఎంకె – బిజెపి కూటమికి విజయ్ కాంత్ గుడ్‌ బై..!

చెన్నై: వచ్చె నెల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో బిజెపి- అన్నాడిఎంకె కూటమికి ఎదురు దెబ్బతగిలింది. కూటమి నుండి నటుడు విజయకాంత్‌ బయటకు వచ్చారు. మూడు దశల్లో చర్చలు జరిగినప్పటికీ.. అన్నాడిఎంకె తమకు కావల్సిన సీట్లను కేటాయించేందుకు నిరాకరించిందని ఆయన పార్టీ డిఎండికె తెలిపింది. కాగా, ప్రముఖ నాయకురాలు, ప్రజా నేత జయలలిత మరణం అనంతరం అధికార అన్నాడిఎంకె పార్టీ మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష డిఎంకె- కాంగ్రెస్‌ కూటమి విజయాన్ని సాధించడంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ సాధించితీరుతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడిఎంకె కూటమి 39 ఎంపి స్థానాలకు గాను 38 స్థానాల్లో ఓటమిపాలైంది. మరోవైపు బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమ పార్టీని విస్తరించాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో బిజెపి పోటీ చేసిన ఐదుస్థానాల్లోనూ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరో నటుడు కమల్‌హాసన్‌ పార్టీ ఎంకెఎం కూడా మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. తమిళనాడులో ఒకే దశలో ఏప్రెల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.