అన్నవరం దేవస్థానంలో అన్నప్రసాద వితరణ పునః ప్రారంభం

అన్నవరం దేవస్థానంలో అన్నప్రసాద వితరణ తిరిగి ప్రారంభమైంది. కొవిడ్‌ కారణంగా గత ఏడాది మార్చి 20 నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణను నిలిపివేశారు. ఈ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్న నేపథ్యంలో తిరిగి ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశాలిచ్చారు. దీంతో ఆదివారం నుంచి సత్యదేవుని భక్తులకు పూర్తిస్థాయిలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఈవో త్రినాథరావు, ధర్మకర్తల మండలి సభ్యుడు కర్రి భామిరెడ్డి భక్తులకు భోజనాలు వడ్డించి ప్రారంభించారు. కొవిడ్‌ కారణంగా నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. హాల్‌లో ఒకేసారికి గతంలో సుమారు 450 మందికి భోజనాలు వడ్డించేవారు. ప్రస్తుతం ఒక బెంచ్‌కు ముగ్గురు చొప్పున 243 మందిని మాత్రమే అనుమతించారు.