సినీపరిశ్రమకు అండగా నిలిచిన ఏపీ సర్కార్..

కరోనా కారణంగా దెబ్బతిన్న సినీపరిశ్రమను ఆదుకోవడానికి ఏపీ సర్కార్ ముందుకు వచ్చింది. పరిశ్రమకు చేయూతనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నది. 3నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేసేందుకు డిసైడ్ అయ్యింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టిప్లెక్స్ లు సహా, అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రభుత్వంపై నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున భారం పడనుంది. మిగిలిన ఆరు నెలల ఫిక్స్డ్ చార్జీల చెల్లింపులను వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1100 థియేటర్లకు ఊరట లభించింది. అంతేకాకుండా రీస్టార్ట్ ప్యాకేజీ కింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏ, బి సెంటర్లలో థియేటర్లకు రూ.10 లక్షల రూపాయల చొప్పున, సి సెంటర్ లోని థియేటర్లకు రూ.5 లక్షల రూపాయల చొప్పున రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వాయిదాల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, తరువాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.4.18 కోట్ల రూపాయల భారం పడుతుంది.

సినిమా పరిశ్రమకు అండగా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డికి, మంత్రి మండలికి పలువురు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను ఆదుకున్నందుకు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎందరో కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు వేల మంది లబ్ధి పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.