జర్నలిస్టుపై దాడి హేయమైన చర్య: అతికారి దినేష్

రాజంపేట, రాప్తాడులో జర్నలిస్టుపై దాడి అత్యంత హేయమైన చర్య అని, దీనిని జనసేన పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తోందని రాజంపేట జనసేన సమన్వయకర్త అతికారి దినేష్ పేర్కొన్నారు. గురువారం పట్టణ శివారులోని యల్లమ్మ ఆలయం సమీపంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి టిడిపి, జనసేన కూటమికి ప్రజలలో ఉన్న ఆదరణ, ఆ ఆదరణను నిష్పక్షపాతంగా ప్రచురించే పత్రికల పట్ల కక్ష పెంచుకుని ఓటమి భయంతో పత్రికా రంగంపై దాడికి సిద్ధపడ్డారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభమైన జర్నలిజంను జగన్ రెడ్డి అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిత్యం ప్రజా సమస్యలపై అక్షర యుద్ధం చేసే జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్ దోపిడీలకు పాల్పడుతూ హత్యలు, అత్యాచారాలు, రౌడీయిజానికి తెర లేపడం ఆయన సైకో తత్వానికి నిదర్శనమన్నారు. నియంతలు, నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని, ఇలాంటివారు కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. గతంలో పత్రికా రంగంపై ఉక్కు పాదం మోపేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవో నెంబర్ 938 ని విడుదల చేస్తే తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి 2019 అక్టోబర్ 20న జీవో నెంబర్ 2430 విడుదల చేశారని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజా శ్రేయస్సు కోసం పోరాడే జర్నలిజంపై ఎన్ని దాడులకు పాల్పడినా, పాత్రికేయులను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా ప్రశ్నించే గొంతుకను ఆపలేరని హితవు పలికారు.