మహాసేన రాజేష్ పై దాడి అప్రజాస్వామికం

•ఫోన్లో రాజేష్ ను పరామర్శించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ప్రజాపక్షం వహిస్తూ గళం వినిపిస్తున్న మహాసేన రాజేష్ పై రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న దాడి అప్రజాస్వామికమని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా సాగుతున్న దాడులను రాజ్యాంగ విలువల పట్ల, ప్రజాస్వామ్య విధానాలపైనా విశ్వాసం ఉన్నవారంతా ఖండించాలి అన్నారు. సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ మహాసేన రాజేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. దాడి పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రజా సమస్యలపైనా, పాలన వ్యవస్థలోని లోపాల గురించి రాజేష్ స్పందిస్తారు. అదే విధంగా అధికార పార్టీ నాయకుల దోపిడీలు, దాష్టీకాలను ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి గొంతును నిలువరించే ప్రయత్నంలోనే ఆదివారం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు శ్రీ రాజేష్ పై దాడి చేశారు. ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో దాడులు, హింసాపూరిత వాతావరణాన్ని పాలకులు సృష్టిస్తున్నారు. ఈ తరహా దుశ్చర్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ పెడ పోకడలను ఆదిలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అన్నారు.