ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కొనసాగుతున్న పరకాల బంద్‌

పరకాల బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా పరకాల పట్టణ బందుకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు తెరచుకోలేదు.

కాగా, ఎమ్మెల్యే ఇంటిపై దాడికి నిరసనగా పరకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రతి మండల కేంద్రం, రహదారులపై కూడళ్ల వద్ద రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

పరకాల ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు ఆదివారం విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించారు. నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో బీజేపీ నేతలు.. పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. వ్యూహాత్మకంగా వెంట తెచ్చుకున్న రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలను గేటు బయట నుంచి చల్లా ఇంటిపైకి విసిరారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు.

విధ్వంసానికి పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు 55 మందిని అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయినవారిలో బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ప్రధాన కార్యదర్శి సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు ఉన్నారు. దాడి చేసినవారిపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.