Balapur Laddu: సీఎం జగన్ చేతికి బాలాపూర్ లడ్డు

ప్రతిష్టాత్మకంగా భావించే హైదరాబాద్ బాలాపూర్ లడ్డు అమరావతికి చేరుకుంది. పాత రికార్డులను బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్‌ చేసి దక్కించుకున్న లడ్డూను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేశారు ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా సీఎం క్యాంపు ఆఫీసులో కలిసిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌ బాలాపూర్ లడ్డూను ఆయనకు అందజేశారు. అబాకస్‌ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్‌ రెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కలిసి లడ్డూను ఆయనకు అందజేశారు.

బాలాపూర్ లడ్డు ప్రసాదంకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఏడాది బాలాపూర్‌లో లడ్డూ మళ్లీ రికార్డ్‌ సృష్టించింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూను 18 లక్షల 90 వేలకు ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్ దక్కించుకున్నారు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌.. నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.

చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి బాలాపూర్ లడ్డూను 17లక్షల 67వేలకు కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. లక్షా 30వేల రూపాయలు అధిక ధర పలకగా.. విఘ్నాలు తొలగించే వినాయకుడి లడ్డూ ప్రసాదం తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. ఈ ఏడాది లడ్డూను సొంతం చేసుకున్న ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌, శశాంక్‌ రెడ్డి స్థానికేతురులు కాగా.. వేలం పాట ముగిసిన వెంటనే 18లక్షల 90 వేలను చెల్లించారు.

26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్‌ గణేష్‌ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్‌ లడ్డూకు పూజలు నిర్వహించిన తర్వాత వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సహా.. రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన వేలం పాటలో 35మంది పాల్గొన్నారు.