‘కర్ణన్’ రీమేక్ లో బెల్లంకొండ హీరో!

బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఆయన డీలాపడిపోలేదు. వినాయక్ దర్శకత్వంలో హిందీలో ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేయడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు అనుకూలించగానే ఈ సినిమా షూటింగు మొదలుకానుంది.

ఒక వైపున ఈ సినిమా కోసం రెడీ అవుతూనే ఆ తరువాత తెలుగు సినిమాను లైన్లో పెట్టే పనిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు. తెలుగులో ఆయన చేయనున్న నెక్స్ట్ మూవీ ‘కర్ణన్’ రీమేక్ అని తెలుస్తోంది. ధనుశ్ హీరోగా ఇటీవల థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగు పూర్తయిన తరువాత ‘కర్ణన్’ రీమేక్ షూటింగ్ మొదలవుతుందట. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి.