కొవిడ్‌-19పై పోరుకి సిద్దమైన బైడెన్ సర్కార్‌..

కరోనా కొత్త స్ట్రెయిన్‌ తీవ్రత నేపథ్యంలో అమెరికాకు విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ పరీక్ష చేయించుకొని విమానం ఎక్కాల్సిందేనని అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అమెరికాలో దిగిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని చెప్పారు. కొవిడ్‌-19పై పోరుకి జాతీయ ప్రణాళికను జారీ చేసిన బైడెన్ సర్కార్‌.. వందరోజుల్లో 10 కోట్లమందికి టీకా ఇచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య నెల రోజుల్లో 5 లక్షలకు చేరువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బైడెన్‌. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొవిడ్ టీకా పంపిణీలో లోపాలు సరిచేసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ వంద రోజుల పాటు ప్రతిఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి సంబంధించి 10 కార్య నిర్వాహక దస్త్రాలపై ట్రంప్ సంతకం చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా 4 లక్షల మంది అమెరికన్లు మృత్యువాత పడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన మొత్తం అమెరికన్ల కంటే.. ఈ సంఖ్య ఎక్కువ. అందుకే యుద్ధప్రాతిపదికన మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. రెండు రోజుల క్రితం మనం శ్రద్ధాంజలి ఘటించాం. దురదృష్టవశాత్తు అదే ఆఖరుది కాకపోవచ్చు. కేసులు ఇలానే పెరిగిపోతూ ఉంటే వచ్చే నెలలో మృతుల సంఖ్య 5 లక్షలు దాటిపోవచ్చు. అయితే ఈ సమస్య నుంచి మనం ఒక్కరాత్రికే బయటపడలేం. కొన్ని నెలల సమయం పట్టవచ్చు. నేను ఒక్కటే చెబుతున్నాను. మనం ఈ మహమ్మారిపై తప్పనిసరిగా విజయం సాధించి తీరుతాం.