బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు..

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణం లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్యపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ ట్రెస్‌పాస్ కింద కేసు నమోదు చేశారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు ఆయనపై ఫిర్యాదు నమోదు అయ్యింది. వర్సిటీ అధికారుల నుంచి ఎంపీ సూర్య అనుమతి పొందలేదు. ఎంపీపై వర్సిటీ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేయడంతో.. కేసు బుక్ చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఎంపీ తేజస్వి.. అధికారుల అనుమతి లేకుండానే వర్సిటీలోకి ప్రవేశించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌పై ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేందుకు వెళ్లిన ఎంపీ తేజస్వి.. వర్సిటీకి గేటు వద్ద అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగించారు. బలవంతంగా ఆయన వర్సిటీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు.

అయితే నగరంలో మతఘర్షణలకు ప్రేరేపిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. జీఎహెచ్ఎఎంసీ ఎన్నికల్లో నాయకులు చేస్తున్న ప్రసంగానలు సున్నితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.