షా బుఖారి బాబా సేవలో బొళియశెట్టి దంపతులు

మైలవరం: కొండపల్లి మున్సిపాలిటీ, కొండపల్లి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా 427వ ఉరుసు మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఆంధ్రా జోన్ కో – కన్వీనర్ బొళియశెట్టి శ్రీకాంత్ సతీ సమేతంగా బాబాను దర్శించుకున్నారు. ఉరుసు ఉత్సవ కమిటీ చైర్మన్, సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా వారికి ఘన స్వాగతం పలికి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం షా బుఖారి బాబాకు శ్రీకాంత్ దంపతులు చాదర్ ను సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ముస్లిం మత గురువులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ షా బుఖారి బాబాను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఉరుసు మహోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేసి ఆతిథ్యమిచ్చిన మత గురువు అల్తాఫ్ బాబాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.